పండుగ మూడ్‌లో భారత్

 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించింది భారత పురుషుల హాకి జట్టు. గురువారం జరిగిన కాంస్య పోరులో బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో ఓడించి పతకాన్ని ముద్దాడింది. దీంతో హాకీ ఇండియాపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

“41 సంవత్సరాల విరామానికి ముగింపు పలుకుతూ ఒలింపిక్‌ పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. ఈ జట్టు గొప్ప నైపుణ్యం, సంకల్పాన్ని ప్రదర్శించింది.ఈ విజయం భారత హాకీలో కొత్త శకానికి నాంది పలకనుంది. క్రీడల పట్ల యువతకు ప్రేరణగా నిలుస్తుంది” అంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్విట్ చేశారు.

“చరిత్ర సృష్టించారు! ఈ రోజు ప్రతి భారతీయుడి మదిలో నిలిచిపోయే రోజు. కాంస్య పతకాన్ని సాధించిన పురుషుల హాకీ బృందానికి అభినందనలు. ఈ విజయంతో వారు ఈ దేశ ప్రజలు, మరీ ముఖ్యంగా యువత ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించారు. మీ పట్ల ఈ దేశం గర్వపడుతోంది” అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్ చేశారు.