ఇక భారమంతా బ్యాట్స్‌మెన్‌దే

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా గెలుపు భారమంతా బ్యాట్స్ మెన్ మీదే ఉంది. తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీసేన 191 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి రోజు బ్యాట్స్‌మెన్‌ చేసిన గాయాలకు బౌలర్లు మందు రాసి, జట్టును మళ్లీ పోటీలోకి తెచ్చేలా కనిపించిన బౌలర్లు.. మధ్యలో కాడి వదిలేయడంతో భారత్‌ 99 పరుగుల విలువైన ఆధిక్యం కోల్పోయింది.ఈ ఆధిక్యాన్ని దాటి ఇంగ్లాండ్‌కు సవాలు విసిరే లక్ష్యాన్ని నిర్దేశించాలంటే బ్యాట్స్‌మెన్‌ అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే.

62 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను భారత్‌ స్కోరు కన్నా తక్కువకే ఆలౌట్‌ చేసేలా కనిపించిన బౌలర్లు.. మధ్యలో పట్టు విడవడంతో ప్రత్యర్థి అనూహ్యంగా 290 పరుగులు చేసింది. 99 పరుగుల విలువైన ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. ఓలీ పోప్‌ (81; 159 బంతుల్లో 6×4), క్రిస్‌ వోక్స్‌ (50; 60 బంతుల్లో 11×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. రెండో రోజు ఆట ఆఖరుకు 16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ (20 బ్యాటింగ్‌), రాహుల్‌ (22 బ్యాటింగ్‌) కాస్త తడబడ్డప్పటికీ.. వికెట్‌ అయితే ఇవ్వలేదు. భారత్‌ ఇంకా 56 పరుగులు వెనుకబడి ఉంది. బ్యాట్స్‌మెన్‌ మూడో రోజంతా నిలిస్తే తప్ప మ్యాచ్‌పై ఆశలుండవు.