కరోనా డెత్ సర్టిఫికెట్స్.. గైడ్ లైన్స్ ఏవీ ?

కరోనాతో మరణించినట్టు ధ్రువీకరణ పత్రాల జారీ విషయమై ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయనందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై ఈ నెల 11లోగా అమలు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కరోనా మరణ ధ్రువపత్రాల మంజూరు, ఆర్థిక సహాయం చెల్లింపుపై ఆరువారాల్లో మార్గదర్శకాలివ్వాలని న్యాయస్థానం జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను ఆదేశించింది. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది.

“కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విషయమై చాలా రోజుల క్రితమే ఆదేశాలు ఇచ్చాం. ఒకసారి గడువును పొడిగించాం. మార్గదర్శకాలు వచ్చే సరికి మూడో దశ ఉద్ధృతి కూడా ముగుస్తుందేమో”నని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.