స్టార్స్ షోస్.. బుల్లితెర వీక్షకుల్లో హుషారు !

సినీ స్టార్స్ స్పెషల్ షోస్ తో బుల్లితెర వెలిగిపోతుంది. వీక్షకుల్లో హుషారు కనిపిస్తుంది. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌లాంటి అగ్రహీరోలు ఈ టీవీ రియాలిటీ షోల్లో అదరగొట్టి కుటుంబ ప్రేక్షకుల ప్రేమాభిమానాలూ పొందారు. ఇప్పుడు మళ్లీ తెలుగులో వాటి హవా మొదలైంది.

మొదట హిందీలో అలరించిన ‘బిగ్‌బాస్ ప్రస్తుతం ఏడు భారతీయ భాషల్లో బుల్లితెర ప్రేక్షకుల మనసు రంజింపచేస్తోంది. తెలుగులో మొదటిసారి ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘బిగ్‌బాస్’ మొదలైంది. అది విజయవంతమవడంతో ఆ తర్వాత సీజన్లను అదే ఊపుతో కొనసాగించారు. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ఐదో సీజన్‌లో మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది. ఐదో సీజన్ ఈ నెల 5 నుంచి మా టీవీలో ప్రసారం కానుంది. దీనికి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

హిందీలో అమితాబ్‌బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ గేమ్ షోని ప్రారంభించారు. సామాన్యులను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో ఈ షోని ప్రారంభించారు. హిట్టయింది. ఇదే కాన్సెప్ట్‌తో తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వచ్చింది. మొదట నాగార్జున, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడీ.. ఈ షో కొద్దిగా పేరు మార్పుతో యంగ్ టైగర్ ఎన్ టీఆర్ హోస్ట్ గా ప్రసారం అవుతుంది. తారక్ తనదైన శైలిలో షోను రక్తికట్టిస్తున్నారు. రామ్ చరణ్‌తో చేసిన మొదటి ఎపిసోడ్ ద్వారా మొదటి రోజు రికార్డు టీఆర్పీ నమోదైంది.

‘మాస్టర్ చెఫ్’ – ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో సూపర్ హిట్టయింది. హిందీలోనూ ఇప్పటికే ఈ షో సూపర్ హిట్. ఇప్పుడీ వంటల పోటీ కార్యక్రమం దక్షిణాదిన కూడా అలరిస్తోంది. ఇందులో జరిగే వంటల పోటీలను రక్తికట్టించడంలో హోస్టులదే కీలక పాత్ర. తెలుగులో మిల్కీబ్యూటీ తమన్నా హోస్ట్‌గా చేస్తుండటంతో ‘మాస్టర్ చెఫ్’ మరింత ఆసక్తికరంగా మారింది.

తమిళంలో విజయ్ సేతుపతి చేస్తుండగా, కన్నడంలో సుదీప్, మలయాళంలో పృథ్వీరాజ్ చేస్తారని సమాచారం. నాలుగు భాషల్లో టెలికాస్ట్ కాబోతున్న కార్యక్రమానికి దర్శకుడు ఒకరే కావడం ఓ విశేషం. ఇక తెలుగు ఓటీటీ ఆహాలో మంచు లక్ష్మి చేస్తున్న మరో వంటల కార్యక్రమమే ‘ఆహా భోజనంబు’. సెలబ్రిటీలతో సరదాగా సాగిపోతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. విష్వక్‌శేన్, మేఘా ఆకాష్, అలీ, ఆనంద్ దేవరకొండ లాంటి తారలు ఇప్పటికే ఈ కార్యక్రమంలో సందడి చేశారు.