రివ్యూ : టక్ జగదీష్ – ఫక్తు ఫ్యామిలీ డ్రామా (3/5)
చిత్రం : టక్ జగదీష్
నటీనటులు : నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు తదితరులు
సంగీతం : తమన్
నేపథ్య సంగీతం : గోపీ సుందర్ దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాత : సాహు గారపాటి, హరీశ్ పెద్ది
విడుదల: (ఓటీటీ) అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేది : 10 సెప్టెంబర్, 2021.
వైవిధ్య కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు నేచురల్ స్టార్ నాని. యేడాదికి మూడ్నాలుగు సినిమాలు చేయడం నాని ప్రత్యేకత. అయితే ఆ సినిమాలన్నింటిని హిట్ చేయడం ఆయన అభిమానులకు అలవాటు. కరోనా విజృంభణతో నాని జోరుకు బ్రేకులు పడ్డాయి. గతేడాది నానినటించిన ‘వి’ ఓటీటీలో సందడి చేసింది. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ అదే బాటలో పయనించింది. వినాయక చవితి కానుకగా ‘టక్ జగదీష్’ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మరీ.. టక్ జగదీష్ ఎలా ఉన్నాడు ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకున్నాడు ?? తెలుసుకుందాం పదండీ.. !
కథ :
భూదేవిపురంలో ఓ భూస్వామి. పేరు ఆదిశేషులు నాయుడు (నాజర్). ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసుబాబు (జగపతిబాబు) తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. చిన్న కొడుకు టక్ జగదీష్(నాని) పట్టణంలో చదుకుంటూ అప్పుడప్పుడు ఊరికి వస్తుంటాడు. గ్రామాన్ని ప్రశాంతంగా చూడాలని ఆశిస్తుంటాడు ఆదిశేషులు నాయుడు. ఒకరోజు ఆదిశేషులు నాయుడు గుండెపోటుతో చనిపోతాడు. దీంతో అప్పటివరకూ మంచివాడిగా నటించిన పెద్దకొడుకు బోసు ఆస్తిపై కన్నేసి మారిపోతాడు.
తన స్వార్థం కోసం మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య)ను తన ప్రత్యర్థి వీరేంద్రనాయుడు(డానియల్ బాలాజీ) తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తన అక్కలకు కూడా ఆస్తి ఇవ్వనని అడ్డం తిరుగుతాడు. ఈ క్రమంలో టక్ జగదీష్ ఏం చేశాడు? తన అన్న బోసులో ఎలా మార్పు తీసుకొచ్చాడు? ఊరి ప్రజల భూములపై కన్నేసిన వీరేంద్రనాయుడి ఆట ఎలా కట్టించాడు? అన్నది మిగతా కథ.
ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ :
దర్శకుడు శివ నిర్వాణ ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. అయితే, హీరో క్యారెక్టరైజేషన్‌ను రాసుకున్న విధానం మెప్పిస్తుంది. భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆది శేషులునాయుడు చనిపోయే వరకూ ఫక్తు ఫ్యామిలీ డ్రామా తెరపై కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. టక్ జగదీష్ రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు. సరిగ్గా విరామ సన్నివేశాలకు దర్శకుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తెరపై చూస్తే ఆసక్తిగా ఉంటుంది.
టక్ జగదీష్ మళ్లీ భూదేవిపురంలోకి అడుగు పెట్టిన తర్వాత కథ, కథనాలు వేగం పుంజుకుంటాయి. ఊళ్లో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ తన తండ్రి మాటను నిలబెట్టేందుకు జగదీష్ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో వీరేంద్రనాయుడు నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాడు. దర్శకుడు ఆ టెంపోను చివరి వరకూ కొనసాగించి ఉంటే బాగుండేది. కానీ మళ్లీ రొటీన్ ఫ్యామిలీ డ్రామాలోకి వెళ్లిపోయాడు. క్లైమాక్స్ లోనూ మెరుపుల్లేవ్. సాదాసీదాగా ముగించాడు.
నాని చిలిపి కామెడీ మిస్ :
నటనలో నానికి తిరుగులేదు. వంశశాతం పాత్రకు న్యాయం చేసే నటుడు. ‘టక్ జగదీష్’గా అద్భుతంగా నటించారు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. అయితే, నాని నుంచి కోరుకునే చిలిపి కామెడీ ఇందులో లేదు. అది కూడా ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది. రీతూవర్మ అందంగా కనిపించింది. నాని-రీతూల కెమిస్ట్రీ తెరపై బాగుంది. జగపతిబాబు సీనియార్టీ బోసు పాత్రకు బాగా పనికొచ్చింది. ఆ పాత్రలో ఉన్న రెండు రకాల వేరియేషన్స్ చక్కగా పలికించారు. ఐశ్వర్య రాజేశ్, డానియల్ బాలాజీ, నాజర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ గా :
ఈ సినిమా కోసం ఇద్దరు సంగీత దర్శకులు పని చేశారు. థమన్ పాటలు అందించాడు. ఒకట్రెండు పాటలు బాగున్నాయి. గోపీ సుందర్ నేపథ్య సంగీతం పర్వాలేదు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- నాని నటన
- ఇంటర్వెల్ ఏపీసోడ్ మైనస్ పాయింట్స్ :
- స్లో నేరేషన్
- ఫస్టాఫ్
- సెకాంఢాఫ్ లో మరింత సాగదీత
- బాటమ్ లైన్ : టక్ జగదీష్.. ఓ సారి చూడొచ్చు.
రేటింగ్ : 3/5