ఐదో టెస్ట్ రీషెడ్యూల్ ఎప్పుడంటే ?

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ రద్దయిన సంగతి తెలిసిందే. భారతబృందంలో ప్రధాన కోచ్ రవిశాస్త్రితో సహా నలుగురు కోచ్ లకు కరోనా సోకింది. టీమ్‌ఇండియా ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బీసీసీఐకి లేఖరాసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇరు బోర్డుల పెద్దలు చర్చించి మ్యాచ్‌ను రద్దు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ను నిలిపివేసినా భవిష్యత్‌లో తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇంగ్లాండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) తోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ త్వరలో ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడని తెలిసింది.సెప్టెంబర్‌ 22న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్‌ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం.

యూఏఈలో ఈ నెల 19 నుంచి ఐపీఎల్ రెండో దశ జరగాల్సి ఉంది. దాంతో భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే ఐపీఎల్ బయోబబుల్ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఐపీఎల్ బయోబబుల్ షెడ్యూల్ ముందే నిర్ణయించారు. అటు ఐపీఎల్ కూడా వాయిదా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ రెండో దశ ముగిసిన వెంటనే యూఏఈ గడ్డపైనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో వచ్చే యేడాదిలో ఐదో టెస్ట్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.