సీఎం రాజీనామా

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. మరో 15 నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం గుజరాత్ రాజకీయాలని ఓ కుదుపు గురి చేశాయని చెప్పవచ్చు.

రాజీనామా అనంతరం విజయ్ రూపానీ మీడియాతో మాట్లాడారు. “నూతన నాయకత్వంలో కొత్త ఉత్సాహం, కొత్త శక్తితో గుజరాత్‌ అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్తుందని ఆశిస్తున్నా. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా. నా లాంటి పార్టీ కార్యకర్తకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు. నా పదవి కాలం మొత్తంలో ప్రధాని మోదీ ఎంతగానో మార్గనిర్దేశం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో గుజరాత్.. అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుంది. ఇందులో నా వంతు సహకారం అందించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా”నన్నారు.

కొత్త నాయకత్వం నేతృత్వంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన నేతకే తదుపరి సీఎం బాధ్యలు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కాంగ్రెస్ బలపడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సొంతం చేసే దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం కొత్త వ్యూహాలకు తెరలేపింది. ఇందులో భాగమే సీఎం మార్పు అని తెలుస్తుంది.