యూఎస్ ఓపెన్ : ఫైనల్ చేరిన జకోవిచ్
ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించేందుకు మరో అడుగు ముందుకేశాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో జకోవిచ్ ఫైనల్‌కు చేరాడు. దీంతో క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను 4-6, 6-2, 6-4, 4-6, 6-2 తేడాతో ఓడించాడు.
మరోవైపు ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జకోవిచ్ ఇక చివరిదైన యూఎస్ ఓపెన్ కూడా సొంతం చేసుకుంటే క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ సాధించే అరుదైన అవకాశం లభించనుంది. 1969లో చివరిసారి లాడ్ రావర్ అనే దిగ్గజం ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ రికార్డు నెలకొల్పే అవకాశం జకోవిచ్ ముందుంది. ఈ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు ఇప్పటికే ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్‌లో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే