ఛలో దుబాయ్.. చార్టర్‌ ఫ్లైట్‌లో !

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ అసంపూర్తిగా ముగిసింది. ఆఖరిదైన ఐదో టెస్ట్ కరోనా కలవరంతో నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు అనుకున్న సమయం కంటే ముందుగానే ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకుంటున్నారు. వీరి కోసం ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా ఛార్టర్ ఫైట్స్ ఏర్పాటు చేయడం విశేషం.

కరోనా నేపథ్యంలోనే మే 4న నిరవధికంగా వాయిదా పడిన టీ20 లీగ్‌.. ఈనెల 19 నుంచి తిరిగి యూఏఈలో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తమ ఆటగాళ్లను దుబాయ్‌కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

ముంబయి ఇండియన్స్‌ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌, పేస్‌గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా తమ కుటుంబాలతో సహా చార్టర్‌ ఫ్లైట్‌లో మాంచెస్టర్‌ నుంచి దుబాయ్‌కు తీసుకొస్తున్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా తమ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీరంతా శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం తమ కుటుంబాలతో సహా వేర్వేరు విమానాల్లో యూఏఈకి చేరనున్నారు.