గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణం

గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ (59) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, మన్సుఖ్‌ మాండవీయ, ప్రహ్లాద్‌ జోషి తదితరులు హాజరయ్యారు.

ఇప్పటి వరకు సీఎంగా ఉన్న విజయ్‌ రూపాణీ శనివారం గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేసిన విషయం తెలిసిందే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టింది. సీఎం పీఠాన్ని పటేల్‌ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడంతో ప్రఫుల్‌ పటేల్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, సీఆర్‌ పాటిల్‌, నితిన్‌ పటేల్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన భూపేంద్ర పటేల్‌ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది.