యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, అర్ధశతాబ్దం తర్వాత కేరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించి చరిత్ర తిరగరాద్దమనుకున్న ప్రపంచ నంబర్‌వన్‌ నోవాక్‌ జకోవిచ్‌కు షాక్‌ తగిలింది. యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ పోరులో ఆయన తడబడ్డాడు. రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ అద్భుతం చేశాడు. తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో 34 ఏళ్ల జకోవిచ్‌ను ఓడించాడు.దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్‌ ఇంకొన్ని రోజులపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఇప్పటికే జకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామని ఉవ్విళ్లూరుతున్న జకోకు నిరాశే ఎదురైంది. ఇక 2019లో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి ఓటమి పాలైన ఈ రష్యా వీరుడు ఇప్పుడు టైటిల్‌ గెలిచి రేసులోకి వచ్చాడు. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో కేవలం ఒక్కసెట్‌లో మాత్రమే ఒడిపోయి టైటిల్‌ గెలిచిన వీరుడిగా మెద్వెదెవ్‌ నిలిచాడు.