నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్ట్ నో

నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు తెలంగాణ హైకోర్ట్ నో చెప్పింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ఈ ఉదయం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.

ప్రభుత్వ రిక్వెస్ట్ కు హైకోర్ట్ నో చెప్పింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని.. కోర్టులది కాదని స్పష్టం చేసింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించింది. హైకోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా ? అని అడిగింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా ? ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. తీర్పులో జోక్యం చేసుకొని సవరించలేమని స్పష్టం చేసింది.