ఏపీకి తెలంగాణ బకాయి రూ. 6వేల కోట్లు

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతుంది.  ఇప్పుడు కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. తెలగాణ ప్రభుత్వం నుంచి తమకు రూ. ఆరు వేల కోట్లపైగా బకాయిలు రావాలని తక్షణం ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. 

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదని అందులో పేర్కొన్నారు. తమ విద్యుత సంస్థలపై రుణభారం పెరిగిపోయిందని అప్పులు చేయడం సాధ్యపడటం లేదని.. ఇప్పుడు తెలంగాణ బకాయిలు ఇవ్వకపోతే తీవ్రంగా ఇబ్బంది పడతామని హైకోర్టు దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. మరో వైపు తెలంగాణ సర్కార్ ఏపీకి తాము ఇవ్వడం కాదు.. తమకే ఏపీ ఇవ్వాలని అంటోంది. ఏపీ నుంచే తమకు ఐదు వేల వరకూ కోట్లు ఇవ్వాల్సి ఉందని అంటోంది. మరీ.. కోర్టులో ఎవరు ఎవరికి బకాయి.. ఎంత ? అన్నది తేలనుంది.