దేశంలో రోజుకు 77 అత్యాచారాలు

నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా రోజుకు 77 అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) నివేదిక వెల్లడించింది. మహిళలపై నేరాలు విభాగంలో 2020 సంవత్సరం లో మొత్తం 3,71,503 కేసులు నమోదుకాగా.. అంతకు ముందు ఏడాది (2019)లో ఈ సంఖ్య 4,05,325 గా ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.

న్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం, 2020లో మొత్తం 28,046 అత్యాచార సంఘటనలు చోటుచేసుకోగా 28,153 మంది బాధితులుగా మారారు. వీరిలో 25,498 మంది 18ఏళ్లకు పైబడిన వారు కాగా 2655 మంది మైనర్లే కావడం విచారించదగ్గ విషయం. అంతకుముందు సంవత్సరాల్లో అనగా 2019లో 32,033 కేసులు, 2018లో 33,356 కేసులు, 2017లో 35,559 అత్యాచార కేసులు నమోదయ్యాయి.

2020లో దేశంలో నమోదైన మొత్తం అత్యాచార కేసుల్లో అత్యధికంగా రాజస్థాన్‌ (5310)లోనే ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్‌ (2769), మధ్యప్రదేశ్‌ (2339), మహారాష్ట్ర (2061), అస్సాం (1657) రాష్ట్రాల్లో అధికంగా చోటుచేసుకున్నాయి. ఇక దేశ రాజధాని దిల్లీలో 997 అత్యాచార కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది.