డేంజర్ వేరియెంట్ల జాడ లేదు

కరోనా ముప్పు ఇంకా తొలగలేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రమాదకరంగా భావిస్తోన్న Mu, C.1.2 రకాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకూ ఈ రెండు రకాలు భారత్‌లో వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన జీనోమ్‌ కన్సార్టియం INSACOG వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో ఆందోళనకరమైన డెల్టా వేరియంట్‌తో పాటు దాని ఉపరకాల ప్రభావమే అధికంగా ఉందని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన C.1.2 రకం మనదేశంలో బయటపడనప్పటికీ అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్‌ సోకిన వారికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టేందుకు ఇప్పటికే ఉన్న సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని INSACOG స్పష్టం చేసింది. 

కొత్తగా వెలుగు చూసిన C.1.2 రకం ఎన్నో ఎక్కువ మ్యుటేషన్లకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఇతర రకాల మ్యుటేషన్‌ రేటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో (ఏడాదికి 41.8 మ్యుటేషన్లు) మార్పులు చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. యాంటీబాడీలను తప్పించుకునే గుణం కూడా C.1.2 సీక్వెన్సుల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక వీటికితోడు టీకాల వల్ల వచ్చే యాంటీబాడీలను ఏమార్చే గుణం మరో ప్రమాదకరమైన Mu రకానికి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదకరమైన వేరియెంట్ల జాడ మనదేశంలో లేకపోవడం ఊరటనిచ్చే అంశం.