కేటీఆర్ ని సైడ్ చేసేశారు
కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల విషయంపై కేటీఆర్, బండి సంజయ్ రాజీనామాలకు సిద్ధమా ? అని సవాళ్లు చేసుకున్నారు. తెలంగాణకు కేంద్రమే అన్నీ నిధులు ఇస్తోందని బండి సంజయ్ తన పాదయాత్రలో చెబుతున్నారు. కాదు తెలంగాణనే కేంద్రానికి నిధులిస్తోందని కేటీఆర్ అంటున్నారు. ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. రాష్ట్రానికి కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇది నిజం కాకపోతే తాను రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. నిజం అయితే బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
కేటీఆర్ సవాల్ పై బండి సంజయ్ స్పందించారు. కాకపోతే ఆయన్ని సైడ్ చేసేశారు. కేటీఆర్ తుపాకీ రాముడని.. సవాల్ చేసే స్థాయి ఆయనకు లేదు. దమ్ముంటే కేసీఆర్ రాజీనామాకు సిద్ధమని సవాల్ చేయాలని తాను సిద్ధమని ప్రకటించారు. తన స్థాయి కేటీఆర్ కాదు. సీఎం కేసీఆర్ అని బండి చెప్పకనే చెప్పారు.
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కేంద్రం నిధులపై ప్రజలకు వివరించారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి చారాన (25 పైసలు) వస్తుంటే.. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఆఠాన (50 పైసలు) పోతున్నాయని.. ఎవరు ఎవరికి ఇస్తున్నారు ? అంటూ చెప్పుకొచ్చారు. కానీ కేటీఆర్ మాటలని ప్రజలు విన్నట్టే విని.. పెడ చెవిన పెట్టారు. ఆ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలని సాధించింది. ఇప్పుడు.. మరోసారి కేంద్రం నిధుల విషయంలో కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ రాజకీయ సవాళ్లు విసుకోవడం విశేషం. మరీ.. ఇప్పుడు ఈ సవాళ్ల రాజకీయం ఎవరికి లాభిస్తుంది అన్నది చూడాలి.