నిర్మాతగా త్రివిక్రమ్.. నవీన్ పోలిశెట్టితో సినిమా !

టాలీవుడ్ టాప్ డైరక్టర్లకు సొంత బ్యానర్లు ఉన్నాయి. వారు నిర్మాణ భాగస్వామిగా మారి సినిమాలు చేస్తున్నారు. సుకుమార్, కొరటాల తమ తమ బ్యానర్లు స్టార్ట్ చేసారు. ఇంకా చాలా మంది డైరక్టర్లు అధికారికంగా, అనఫీషియల్ గా నిర్మాణాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ వంతు వచ్చింది. ఆయన నిర్మాణ భాగస్వామిగా మారనున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి సినిమాలు నిర్మించబోతున్నారు. అయితే నిర్మాతగా ఆయన పేరు వుండదు. ఆయన సతీమణి పేరు వుంటుంది.

తొలిసినిమాగా నవీన్ పోలిశెట్టి హీరోగా సినిమా ప్రకటించబోతున్నారు. జాతిరత్నాలు సినిమాతో ఇటీవల అతి పెద్ద కమర్షియల్ హిట్ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి ఓ సినిమా సితార సంస్థకు ఓకె చేసారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్  తో పాటు త్రివిక్రమ్ స్వంత  బ్యానర్ ఫార్ట్యూన్ ఫోర్ కూడా పాలు పంచుకుంటుంది. రాజమండ్రి అవుట్ స్కర్ట్స్ లో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే పేరుతో త్రివిక్రమ్ కు థియేటర్ వుంది. అదే పేరును ఇప్పుడు బ్యానర్ గా మార్చారు.

వాస్తవానికి హారిక & హాసిని బ్యానర్ త్రివిక్రమ్ సొంత బ్యానర్ గా చెబుతుంటారు. ఆయన సినిమాలన్నీ ఈ బ్యానర్ లోనే తెరకెక్కుతాయి. అప్పుడు ఆ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ బయటికి రానున్నారు. సొంత బ్యానర్ ‘ఫార్ట్యూన్ ఫోర్’లో సినిమాలు నిర్మించనున్నారు. ప్రస్తుతానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో జతకడుతున్నారు. ఆ తర్వాత మిగితా బ్యానర్స్ తో కలిసి త్రివిక్రమ్ సినిమాలు నిర్మించే అవకాశాలు ఉన్నాయి.