వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు

తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ, అనుబంధ రంగాల్లో వచ్చే ఐదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2021-26 కాలానికి వర్తించే రెండో ‘ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’ పాలసీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో వార్షిక వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.

ప్రపంచంలో 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. 7 శాతం ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రాష్ట్రంలోనే అవుతోందన్నారు. ఈ-గవర్నెన్స్‌ ద్వారా సిటిజెన్‌ సేవలు కూడా అందిస్తున్నామని తెలిపారు. గ్లోబల్ సంస్థలతో కలిసి ఎమర్జింగ్‌ టెక్‌లో పురోగతి సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కొత్త పాలసీ ద్వారా పౌరులను మరింత చైతన్యవంతులను చేయాలన్నదే తమ ఉద్దేశమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా కౌన్సిల్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మెన్‌, సియంట్‌ ఛైర్మన్‌ మోహన్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుల్లో ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం నిరుద్యోగులు యేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య ఒకే దఫాలో 50వేల ఉద్యోగాల భర్తీ అన్నారు. జోన్ల సమస్య తీరింది. కేంద్రం జోన్లని ఖరారు చేసింది. ఇక నోటిఫికేషన్స్ రావడమే ఆలస్యం అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ రాలేదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడితే.. ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి పోయే అవకాశం ఉంది.