కరోనా ఎప్పటికీ ఉండిపోతుంది.. కానీ ప్రమాదం కాదు !

కరోనా మహమ్మారి అంతం ఎప్పుడు ? బహుశా.. ఉండకపోవచ్చు. ఎప్పటికీ ఉండిపోయే వైరస్ లా కరోనా మారవచ్చు. రానున్న రోజుల్లో ఇది స్థానికంగా ఎప్పటికీ ఉండిపోయే (Endemic) దశలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న 6 నెలల్లోనే కొవిడ్‌-19 ఎండెమిక్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 

‘కరోనా వైరస్‌ మహమ్మారి మన అంచనాలకు అందని విధంగా విజృంభించింది. కానీ, రానున్న ఆరు నెలల్లోనే ఇది స్థానికంగా ఉండిపోయే ‘ఎండెమిక్‌’ దశకు చేరుకుంటుంది. ముఖ్యంగా మరణాల సంఖ్య, సంక్రమణ రేటు నియంత్రణలో ఉన్నట్లయితే వ్యాధిని కట్టడి చేసుకోవచ్చు’ అని ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

 (WHO) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ఇటీవల మాట్లాడుతూ.. “భారత్‌లో ఇక ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి కొవిడ్‌-19 మారుతున్నట్లు కనిపిస్తోంది. భారత్‌లో జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే.. కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కొవిడ్‌ ప్రస్తుత తరహాలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.