పవన్-త్రివిక్రమ్ బ్యానర్లు కలిసి సినిమాలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఓ బ్యానర్ ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ ని మ‌ళ్లీ…. ట్రాక్ లో పెట్టాల‌న్న‌ది ప‌వ‌న్ ఉద్దేశ్యం. దీని బాధ్యతని త్రివికమ్ పై పెట్టారన్నది లెటెస్ట్ అప్ డేటు. ప్రస్తుతం ఓటీటీ హ‌వా న‌డుస్తోంది. వాటి కోస‌మైనా చిన్నా చిత‌కా సినిమాలు చేయాల‌ని, చ‌ర‌ణ్ తో ఓ భారీ సినిమా చేయాల‌ని, నితిన్ తో కూడా ఓ సినిమా చేయాల‌ని.. ఇలా ర‌క‌ర‌కాల ప్లాన్స్ పవన్ కు ఉన్నాయి. ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్ మైండ్ లో ఉన్న ఆలోచ‌న‌లు ఇవి.

 ఇప్పుడు ఈ బాధ్య‌త త్రివిక్ర‌మ్ పై పెట్టార్ట. క‌థ‌లు విన‌డం, ద‌ర్శ‌కుల్ని సెలెక్ట్ చేయ‌డం, ప్రాజెక్టు ప‌ట్టాలెక్కించ‌డం.. ఇవ‌న్నీ త్రివిక్ర‌మ్ బాధ్య‌త‌లు. మ‌హేష్ తో సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ కోసం ఓ క‌థ‌ని సెలెక్ట్ చేసి, సినిమాని ప‌ట్టాలెక్కించేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు త్రివిక్ర‌మ్. మరోవైపు త్రివిక్రమ్ కు సొంత బ్యానర్ వచ్చేసింది. ఫార్చూన్ పోర్స్ పేరిట ఓ బ్యానర్ ని తీసుకొచ్చారు. జాతిరత్నం నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా కూడా ప్రకటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ వ్యవహారాలన్ని త్రివిక్రమ్ సతీమణి చూసుకోనున్నారు. 

ఇప్పుడు త్రివిక్రమ్ పవన్ బ్యానర్ లో సినిమాలు పట్టాలెక్కించేందుకు కసరత్తు మొదలుపెట్టాడు. మరి ఈ ప్రాజెక్టులోనూ త్రివిక్ర‌మ్ కి వాటా ద‌క్కుతుందా? పవన్-త్రివిక్రమ్ బ్యానర్లు కలిసి సినిమాలు నిర్మిస్తాయా ? అన్నది తెలియాల్సి ఉంది.