పీకే ప్లాన్ అదిరింది.. యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక !

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే యేడాది జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీలో రాజకీయ వేడి రాజుకుంది. బీజేపీతో తలపడేది సమాజ్ వాదీ పార్టీనే అన్న క్లారిటీ వచ్చింది. బీజేపీతో బీఎస్పీ లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటోంది. ఇక కాంగ్రెస్‌కు మాత్రమే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే ప్రియాంకా గాంధీ సీఎం అభ్యర్థి అనే ఓ ప్రచారాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్లాన్‌లలో భాగంగానే ప్రియాంక కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అనే ప్రచారం ప్రారంభించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒకప్పుడు యూపీలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు సాదాసీదా ఓటు బ్యాంకును కూడా పొందలేకపోతోంది. మళ్లీ గాంధీ కుటుంబం చరిష్మాను ఉపయోగించుకుంటే తప్ప  ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. యూపీలో ప్రియాంక చరిష్మా వర్కవుట్ అయితే.. ఆమెనే కాబోయే పీఎం అభ్యర్థిగా ప్రచారం చేసే ప్లాన్ కూడా పీకే వద్ద ఉందట. కాంగ్రెస్ పీఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ అయితేనె బెటర్ అనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. దాన్ని ఇలా.. మెల్లగా బయటికి తీసుకొస్తున్నారు పీకే. యూపీ ఢిల్లీకి దగ్గర దారి. అందుకే యూపీ సీఎం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకని ఎంచుకున్నారు పీకే అంటున్నారు.