హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్
హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుని సవరించాలని ప్రభుత్వం కోరినా.. అందుకు హైకోర్టు అంగీకరించలేదు. ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ ఏడాది నిమజ్జనానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
విగ్రహాల నిమజ్జనం కోసం 22 చిన్న చెరువులను ప్రభుత్వం సిద్ధం చేసిందని.. కానీ అందులో పెద్ద విగ్రహాల నిమజ్జనం సాధ్యంకాదని, అందుకే ఈ ఏడాదికి మినహాయింపు కోరుతున్నామని తెలంగాణ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై పిటిషనర్ వేణుమాధవ్ స్పందిస్తూ ఏటా ఇలాగే చెబుతూ మళ్లీ మొదటికి వస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికే అనుమతిస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది.