తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చిస్తున్న అంశాలు ఇవే !
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మార్చ్ 26న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అప్పటి నుంచి ఆర్నేళ్ల లోపు అంటే.. ఈ నెల 25లోగా ఉభయ సభలని మరోసారి సమావేశ పరచాల్సి ఉంటుంది. తాజా కేబినేట్ భేటీలో శాసనసభ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు.. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
దళితబంధు పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు మరో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. పంటల సాగు, వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం నిర్ణయం, సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల భర్తీ అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అంశాలు కూడా చర్చకు రానున్నాయని తెలుస్తోంది.