రివ్యూ : మాస్ట్రో – బెస్ట్ రిమేక్ – థియేటర్స్ లో చూడాల్సిన సినిమా (4/5)

చిత్రం : మాస్ట్రో

నటీనటులు : నితిన్‌, తమన్నా, నభా నటేశ్‌, జిషు సేన్‌ గుప్త, నరేశ్‌ తదితరులు

సంగీతం : మహతి స్వర సాగర్‌  

దర్శకత్వం : మేర్లపాక గాంధీ

నిర్మాత : సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి

విడుదల : డీస్నీ+హాట్‌స్టార్‌

విడుదల తేది : 17 సెప్టెంబర్, 2021.

రేటింగ్ : 4/5

హిట్టు.. ప్లాపు హీరో నితిన్ కి కొత్తేమీ కాదు. వరుసగా డజను ప్లాపులని తట్టుకొని నిలబడిన కథానాయకుడు ఆయన. ఈ యేడాది నితిన్ చేసిన రెండు సినిమాలు చెక్, రంగ్ దే ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆయన వచ్చిన ముచ్చటగా మూడో చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘అంధాదున్‌’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రలో నితిన్‌ ఎలా నటించారు ? మేర్లపాక గాంధీ దర్శకుడు. మరీ.. మాతృకలోని మాజిక్ రిపీట్ అయింది. తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
అరుణ్‌ (నితిన్‌) అంధుడు. 14ఏళ్ల వయసులో క్రికెట్‌ బాల్‌ తగలడం వల్ల కంటి చూపుపోతుంది. అయితే, అరుణ్ లో ఉన్న టాలెంట్‌ ఏంటంటే పియానో చక్కగా వాయించడం. తన పియానో పాడైపోవడంతో కొత్తది కొనుక్కోవాలని చూస్తాడు. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్‌లో అమ్మకానికి ఉన్న పియానో కొందామని వెళ్తాడు. అక్కడే ఆ రెస్టారెంట్‌ ఓనర్‌ కుమార్తె సోఫి (నభా నటేశ్‌)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. అదే రెస్టారెంట్‌కు తరచూ వస్తుంటాడు ఒకప్పటి హీరో అయిన మోహన్‌(నరేశ్‌). అరుణ్‌లోని టాలెంట్‌ చూసి తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంటికి వచ్చి పియానో వాయించమని చెబుతాడు. అరుణ్‌.. మోహన్‌ ఇంటికి వెళ్లే సరికి అతడు హత్యకు గురవుతాడు. ఇంతకీ ఈ హత్య చేసిందెవరు? దీనికీ మోహన్‌ భార్య సిమ్రన్‌ (తమన్నా), బాబీ (జిషు సేన్‌ గుప్త)లకు సంబంధం ఏంటి? అంధుడైన అరుణ్‌ ఆ హత్య విషయాన్ని పోలీసులకు చెప్పాడా? అన్నది వినోదం, సస్పెన్స్ తో సాగిన పూర్తి కథే మాస్ట్రో.

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

రిమేక్ అన్నప్పుడు మాతృకలోని ఆత్మని ఏమాత్రం చెడగొట్టకూడదు. అవసరమైతే.. అదనపు బలాలని జత చేయాలి. ‘దబాంగ్’ రిమేక్ గా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మాతృకని మించేలా ఉంటుంది. ఇందులో అదనంగా అంతాక్షరి ఏపీసోడ్ ని జత చేశాడు దర్శకుడు. అది బాగా క్లిక్ అయింది. ఇలాంటి మార్పులు చేర్పు చేయాలి. మాస్ట్రో విషయంలో దర్శకుడు ఇలాంటి మార్పుల జోలికి పోలేదు. కానీ మాతృకలోని ఆత్మ ఏ మాత్రం చెడకుండా ‘అంధాదున్‌’ను ‘మాస్ట్రో’గా మలిచిన తీరు బాగుంది.

అంధుడైన అరుణ్‌ డైలీ లైఫ్‌, పియానోపై అతనికున్న పట్టును చూపిస్తూ కథను ప్రారంభించాడు. ఒక్కో సన్నివేశాన్ని అల్లుకుంటూ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆయా సన్నివేశాలన్నీ సరదాగా, ఉత్కంఠగా సాగుతాయి. అంధుడైన అరుణ్‌ నటన నవ్వులు పూయించడంతో పాటు, అలరించేలా సాగుతుంది. 

అంధుడి పాత్రలో నితిన్‌ అద్భుతంగా నటించాడు. అరుణ్‌ పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. ప్రథమార్ధమంతా సరదా సన్నివేశాలతో అంధుడిగా అలరించిన నితిన్‌, ద్వితీయార్ధానికి వచ్చే సరికి భావోద్వేగాలపరంగా చక్కటి హావభావాలు పలికించాడు. సిమ్రన్‌ పాత్ర పోషించిన తమన్నా కూడా చక్కగా నటించింది. రెండు భిన్న పార్శ్వాలను చూపించే ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనదైన నటన కనబరిచింది. ఇక జిషు సేన్‌ గుప్త, నభా నటేశ్‌, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా : 

దర్శకుడు మేర్లపాక గాంధీ ‘అంధాదున్‌’ను ‘మాస్ట్రో’గా మలిచిన తీరు బాగుంది. మహతి స్వర సాగర్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ప్లస్ పాయింట్స్

* నితిన్‌, తమన్నా

*  వినోదం, ట్విస్టులు

*  నేపథ్య సంగీతం

  • సినిమాటోగ్రఫీ

  • మైనస్ పాయింట్స్ :
  • సెకాంఢాఫ్ లో కొన్ని సన్నివేశాలు

ఫైనల్ గా : మాస్ట్రో – బెస్ట్ రిమేక్ – థియేటర్స్ లో చూడాల్సిన సినిమా

రేటింగ్ : 4/5