నితిన్ హిట్ కొట్టాడోచ్ !

హిట్టు.. ప్లాపు హీరో నితిన్ కి కొత్తేమీ కాదు. తొలి సినిమా ‘జయం’ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కెరీర్ బాగానే సాగింది. దిల్ లాంటి హిట్ ఖాతాలో పడింది. కానీ ఎంత ఎత్తుని చూశాడో.. అంత లోతుని కూడా నితిన్ చూశాడు. వరుసగా దాదాపు డజను సినిమాలు ప్లాపు. అయినా నిరాశ పడలేదు. వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు.ఆ వెంటనే గుండెజారి గల్లంతైయిందే తో మరో హిట్ కొట్టాడు. ఇక అప్పటి నుంచి విభిన్నమైన కథలని ఎంచుకుంటూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు.

భీష్మ తర్వాత నితిన్ చేసిన చెక్, రంగ్ దే సినిమాలు నిరాశపరిచాయి. అయితే తాజాగా నితిన్ ఖాతాలో మరో హిట్ పడింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ట్రో హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘అంధాదున్‌’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రలో నితిన్‌  నటించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. నితిన్ కి జంటగా నభా నటాషా నటించింది. తమన్నా కీలక పాత్రలో కనిపించింది. ఓటీటీ వేదికగ డీస్నీ+హాట్‌స్టార్‌ లో మాస్ట్రో ఈరోజు విడుదలైంది.

సినిమా బాగుంది. ‘అంధాదున్‌’ కు ఫర్ ఫెక్ట్ తెలుగు రిమేక్ అని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. ఇది థియేటర్ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. కామెడీ, సస్పెన్స్ తో సినిమాని దర్శకుడు అద్భుతంగా ముందుకు నడిపించాడు. నితిన్ అద్భుతమైన నటన, తమన్నా గ్లామర్ చిత్రానికి హైలైగా నిలిచాయని చెబుతున్నారు. నితిన్ హిట్ కొట్టాడోచ్ అంటూ ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.