ధనాధన్.. కొత్త కెప్టెన్ ఎవరు ?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సడెన్ షాక్ ఇచ్చారు. పొట్టిక్రికెట్ ప్రపంచకప్ అనంతరం టీ20 కెప్టెన్ గా తప్పుకుంటానని ప్రకటించాడు. పని భారం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. మరి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా గొప్ప రికార్డున్న రోహిత్ శర్మకే టీ20 పగ్గాలు దక్కుతాయా.. లేక ‘యువ కెప్టెన్’ వైపు బీసీసీఐ చూస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
గతంలో పొట్టి క్రికెట్ కెప్టెన్ ఎంపిక విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సౌరవ్ గంగూలీ నుంచి కెప్టెన్ బాధ్యతలని యువరాజ్ సింగ్ కి అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ యువీ కాదని టీ20 కెప్టెన్ బాధ్యతలని మహేంద్ర సింగ్ ధోనికి అప్పగించారు. ధోని సారధ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో.. అతడినే పూర్తిస్థాయి కెప్టెన్ గా చేసింది.
ఇప్పుడు కోహ్లీ స్థానంలో రోహిత్ ని కెప్టెన్ గా నియమిస్తారా ? లేక యువతకి పెద్దపీఠ అంటూ రిషబ్ పంత్ లాంటి యువకుడిని కెప్టెన్ ని చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో రోహిత్ ట్రాక్ రికార్డ్ గొప్పది. అతడి సారధ్యంలోని ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు కప్ గెలిచింది. కానీ తొలిసారి ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పంత్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అందుకే.. ధనాధన్ కెప్టెన్ విషయంలో అనుభవం అక్కర్లేదు. సంచలనాలే ముఖ్యం అని చెప్పవచ్చు.
ఇక టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ 45 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు. 27 గెలిచి, 14 ఓడిపోయాడు. రెండు మ్యాచ్‌లు టైగా ముగియగా.. మరో రెండు రద్దయ్యాయి. కెప్టెన్‌గా కోహ్లి టీ20 గెలుపు శాతం 65.11. కోహ్లి సారథ్యంలో భారత జట్టు విదేశాల్లో టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేసింది. 2018లో దక్షిణాఫ్రికాలో 2-1తో పొట్టి సిరీస్ గెలిచిన టీమ్‌ఇండియా.. అదే ఏడాదిని ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో 2-1తో ఓడించింది. 2019-20 సీజన్‌లో న్యూజిలాండ్‌ను దాని సొంతగడ్డపై 5-0తో చిత్తు చేసింది.