మితిమీరి మాట్లాడితే.. ఇక అంతే ! కేటీఆర్ హెచ్చరికలు

ఇన్నాళ్లు ఒక లెక్క. ఇకపైన ఒక లెక్క అంటున్నారు మంత్రి కేటీఆర్. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎలాపడితే అలా మాట్లాడినా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు దూషించినా, తెలంగాణను కించపరిచినా, రాష్ట్ర ప్రయోజనాలు, పురోగతి, గణాంకాల విషయంలో అబద్ధాలతో తప్పుదారి పట్టించినా రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనుకాడబోమని అన్నారు.

ఇప్పటికే మహారాష్ట్రలో సీఎంను చెంపదెబ్బ కొడతామన్న కేంద్ర మంత్రిపై అక్కడి కాంగ్రెస్‌ భాగస్వామ్య ప్రభుత్వం కేసులు పెట్టిందని, దానినే తాము స్ఫూర్తిగా తీసుకుంటామన్నారు. ఎవరి బాగోతమేంటో, అక్రమ సంపాదన ఎంతో తమకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామన్నారు. తమ పార్టీ శ్రేణుల సహనానికీ హద్దు ఉంటుందని, మితిమీరి మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతామన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాజద్రోహం కేసులు పెట్టేందుకు.. ఈ కేసుల్లో దాదాపు రెండు, మూడ్నెళ్లు జైల్లో ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. ఇక ఇప్పటికే తీన్మార్ మల్లన్న అరెస్టైన సంగతి తెలిసిందే.