కేటీఆర్ ‘వర్సెస్’ రేవంత్.. కొత్త టర్న్ !

మంత్రి కేటీఆర్‌.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఒకరు ట్వీట్‌ చేస్తే దానికి ప్రతిగా మరొకరు కౌంటర్‌ ఇస్తున్నారు. ఆ ఇద్దరి ట్వీట్ల వార్‌తో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఇప్పుడీ.. ఈ ఫైట్ కొత్త టర్న్ తీసుకుంది. తనపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని.. కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.

డ్రగ్స్‌ నిర్మూలనకు తాను ‘వైట్‌ ఛాలెంజ్‌’ ప్రారంభిస్తున్నానని ఇటీవల రేవంత్‌ ప్రకటించారు. దీనికోసం తాను కూడా సిద్ధమని.. డ్రగ్స్‌ పరీక్షల కోసం తన రక్తం, వెంట్రుకల నమూనాలను ఇస్తానని చెప్పారు. అక్కడితో ఆగకుండా మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఛాలెంజ్‌ విసురుతున్నానని తెలిపారు. వాళ్లిద్దరూ ఛాలెంజ్‌ను స్వీకరించి మరో ఇద్దరికి ఛాలెంజ్‌ చేయాలని రేవంత్‌ కోరారు.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు వద్దకు చేరుకుంటానని.. ఏ ఆస్పత్రికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. డ్రగ్స్‌ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని చెప్పారు. డ్రగ్స్‌ కేసుపై మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని.. ఓ మంత్రిగా ఎందుకు జోక్యం చేసుకోకూడదని రేవంత్‌ ప్రశ్నించారు. ‘వైట్‌ ఛాలెంజ్‌’పై కేటీఆర్‌ స్పందించారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ మాటల యుద్ధానికి పులిస్టాప్ పెడుతూ.. మంత్రి కేటీఆర్ పరువునష్టం దావాతో కోర్టుని ఆశ్రయించడం విశేషం.