21 అవమానాల తర్వాత సన్మానాలు

21 అవమానాల తర్వాత అవకాశం దక్కింది. అక్కడి నుంచి అవమానాల స్థానంలో సన్మానాలు మొదలయ్యాయి అన్నారు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబోస్ పర్సనల్, సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరానికి వచ్చేసరికి శ్రీకాంత్‌ నటించిన ‘తాజ్‌ మహల్‌’లో అవకాశం దక్కింది. పరీక్షలు కూడా అదే సమయంలో రాశాను. పాట కూడా మంచి విజయం సాధించింది. ఇంజనీరింగ్‌ పట్టా చేతికొచ్చింది. 

డిగ్రీ పట్టా, హిట్టైన పాట చేతిలో ఉన్నాయి. తరువాత ఎటెళ్లాలో అర్థం కాని పరిస్థితి. అమ్మానాన్నలేమో నేను ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉండాలని ఆశపడుతున్నారు. చిన్నప్పటి నుంచి సాహిత్యం, సంగీతం, సినిమాలంటే నాకు విపరీమైన వ్యామోహం. అందుకే ఇన్నేళ్ల చదువును పక్కనపెట్టి నా కల నెరవేర్చుకునేందుకు రంగంలోకి దిగాను అని చెప్పుకొచ్చారు.  వంద అవమానాలు జరిగే దాకా ప్రయత్నించి, అప్పటికీ ఫలితం దక్కకుంటే వెనక్కి వెళ్దామనుకున్నాను. ఇలా ఆఫీసుల చుట్టూ తిరగడం, ఎవరైనా నొచ్చుకున్నట్లు మాట్లాడితే వాటిని పుస్తకాల్లో రాసుకున్నాను. ఇలా 21 అవమానాల తర్వాత అవకాశం దక్కింది. అక్కడి నుంచి అవమానాల స్థానంలో సన్మానాలు మొదలయ్యాయని తెలిపారు.