డబుల్ షాక్ ఇవ్వబోతున్న కేసీఆర్ సర్కార్
తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెరగనున్నాయి. మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆర్టీసీ, విద్యుత్ శాఖలపై సమీక్షించారు. మంత్రులు కేటీ రామారావు, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సీఎస్ సోమేశ్‌కుమార్, రవాణా, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌శర్మ, రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు కూడా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. ఆరేళ్లుగా ఛార్జీలను సవరించలేదు. ఇప్పుడు పెంచక తప్పదని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఛార్జీల పెంపుపై వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని రవాణా, విద్యుత్ శాఖ మంత్రులు, అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ ఛార్జీలని చివరిసారిగా 2019 డిసెంబరులో పెంచారు. కనీస ఛార్జీని రూ. 5 నుంచి రూ. 10కి చేరుస్తూ మొత్తంగా ఛార్జీలను 20 శాతం వరకు పెంచింది. దాంతో రోజువారీ ఆదాయం రూ. 4 కోట్ల మేరకు పెరిగింది. అంతలోనే కరోనా కారణంగా 2020 మార్చిలో లాక్డౌన్ ప్రారంభం కావటంతో బస్సులు మూలకు చేరాయి. మహమ్మారి తగ్గుముఖం పట్టటంతో ఇప్పుడిప్పుడే ఆదాయం కొద్దికొద్దిగా పుంజుకుంటోంది.అయితే డీజిల్, విడిభాగాల ధరల పెరుగుదల కారణంగా ఈసారి కనీసం 10 నుంచి 20 శాతం మేరకు ఛార్జీలు పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. 20 శాతం పెంచితే రోజువారీ ఆదాయం రూ. 6 నుంచి రూ. 7 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా.