పాకిస్థాన్ మీదుగా అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాష్టింగ్టన్ విమానాశ్రయంలో ఆయన ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో మోదీకి స్వాగతం పలికారు. మూడు రోజులపాటు అక్కడ ఆయన పర్యటన కొనసాగనుంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ పర్యటన కొనసాగనుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్ పరిణామాలు తదితర అంశాలపై వారితో మోదీ చర్చించనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, క్వాడ్ సదస్సుల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈనెల 26న ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు. అధ్యక్షుడిగా జో బైడన్ ఎన్నికైన తర్వాత భారత ప్రధాని అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి.
మోదీ బయల్దేరిన విమానం పాకిస్థాన్ గగనతలంపై నుంచి ప్రయాణించింది. అఫ్గాన్ మీదుగా వెళ్లాల్సిన విమానాన్ని.. భద్రత కారణాల దృష్ట్యా పాక్ మీదుగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు పాకిస్థాన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. భారత నిఘా వర్గాల సూచన మేరకు ఈ మార్పు జరిగింది. అధికరణం 370 రద్దు తర్వాత భారత్‌పై గుర్రుగా ఉన్న పాకిస్థాన్.. గగనతలాన్ని ఉపయోగించుకోకుండా చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్లాండ్ పర్యటన సహా మోదీ అమెరికా, జర్మనీ పర్యటనల కోసం భారత అధికారులు గతంలో అనుమతులు కోరగా మూడుసార్లు తిరస్కరించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక పర్యటన కోసం మన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు భారత్ అనుమతించింది.