కోల్ కతా చేతిలో ముంబై చిత్తు

ఐపీఎల్-14 రెండో పార్టులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వరుసగా రెండో విజయం సాధించింది. రాహుల్‌ త్రిపాఠి (74 నాటౌట్‌; 42 బంతుల్లో 8×4, 3×6), వెంకటేశ్‌ అయ్యర్‌ (53; 30 బంతుల్లో 4×4, 3×6) వీర విహారం చేయడంతో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసింది.

156 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా.. 15.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట ముంబయి 6 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. డికాక్‌ (55; 42 బంతుల్లో 4×4, 3×6) టాప్‌ స్కోరర్‌. ఫెర్గూసన్‌ (2/27), నరైన్‌ (1/20), ప్రసిద్ధ్‌ కృష్ణ (2/43), వరుణ్‌ చక్రవర్తి (0/20) ముంబయిని కట్టడి చేశారు.

ఇటు వెంకటేశ్‌ అయ్యర్‌.. అటు రాహుల్‌ త్రిపాఠి. కసిగా ఆడారు. బౌండరీ మీద బౌండరీలు బాదారు. ఆ దంచుడికి, ఆ విధ్వంసానికి బలమైన ముంబయి బౌలింగ్‌ దళం తేలిపోయింది. 156.. పరుగుల లక్ష్యం మరో 29 బంతులు మిగిలి ఉండగానే కరిగిపోయింది. నాలుగో విజయంతో కోల్ కతా నాలుగో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి అయిదో ఓటమితో తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.