TS అసెంబ్లీ మీటింగ్స్ : సభ ముందుకు 8 బిల్లులు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం దళితబంధుపై చర్చను ప్రధానాంశంగా తీసుకోనుంది. దళితబంధుకు చట్టబద్ధత కల్పించే బిల్లు చర్చకు అవకాశం ఉంది. ఇతర వర్గాలకూ ఇలాంటి పథకం తేవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి.

మొత్తం 8 బిల్లులని సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దళితబంధుకు చట్టబద్ధత, పర్యాటకులు, ప్రయాణికులకు దళారుల ఆగడాలను నిలువరించేలా తీసుకొస్తున్న ప్రత్యేక చట్టం కోసం ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, కొండా లక్ష్మణ్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయాల చట్టాలను సవరిస్తూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లులు పెట్టనుంది. రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ, పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టాల సవరణ బిల్లులు ఉభయసభల ముందుకు రానున్నాయి. 

ఇక సభలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనుగోలుకు నిరాకరించడం, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కేంద్ర వైఖరి, కృష్ణా, గోదావరి బోర్డులపై నోటిఫికేషన్‌ జారీ వంటి వాటిపైనా చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాల భర్తీ అంశాలు ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. శాంతి భద్రతలు, మహిళలు-చిన్నారులపై దాడులు, డ్రగ్స్‌ వంటి అంశాల పైనా చర్చించే వీలుంది. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థలు కోరిన తరుణంలో వాటిపైనా చర్చించనున్నారు.