పాక్‌కు చురకలంటించిన భారత్‌

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్‌ చురకలంటించింది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌.. ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంద’ని భారత్‌ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్‌ దుర్నీతి వల్ల యావత్తు ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ఓ అంతర్జాతీయ వేదికపై అవాస్తవాలతో విషం చిమ్మేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. అందుకే నిజాల్ని ప్రపంచం ముందుంచాలనుకుంటున్నాం అని ఐరాసలోని భారత ప్రతినిధి స్నేహా దూబే దీటుగా బదులిచ్చారు.

అమెరికాలో ప్రపంచ వాణిజ్య భవంతులపై జరిగిన ఉగ్రదాడిని ఈ సందర్భంగా భారత్‌ ప్రస్తావించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ మారణహోమాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని వ్యాఖ్యానించింది. అంతటి ఘోరానికి పాల్పడిన ఉగ్రనేత ఒసామా బిన్‌ లాడెన్‌కు పాక్‌ ఆశ్రయమిచ్చిందని గుర్తు చేసింది. పైగా ఆ ముష్కరుణ్ని పాక్‌ నేతలు అమరుడిగా కీర్తిస్తున్నాయని పాక్‌ దుర్బుద్ధిని ఎండగట్టింది. ఇంకా పాకిస్థాన్‌ తమ ఉగ్రచర్యల్ని సమర్థించుకుంటోందని స్పష్టం చేసింది. ఈ ఆధునిక యుగంలో ఉగ్రసమర్థ చర్యలు ఏమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పింది.