ధోనీ-కోహ్లీ ఏమన్నారంటే.. ?
చెన్నై ఈజ్ బ్యాక్. ఐపీఎల్-14 సీజన్‌లో చెన్నై దూసుకుపోతోంది. శుక్రవారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కూల్ గా గెలిచేసింది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.మొదట బెంగళూరు 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. పడిక్కల్ (70; 50 బంతుల్లో 5×4, 3×6), కోహ్లి (53; 41 బంతుల్లో 6×4, 1×6) రాణించారు. ఓ మోస్తారు టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ (38; 26 బంతుల్లో 4×1, 1×6), అంబటి రాయుడు (32; 22 బంతుల్లో 3×4, 1×6), డుప్లెసిస్ (31; 26 బంతుల్లో 2×4, 2×6) సత్తా చాటారు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన చెన్నై కెప్టెన్ ధోనీ.. బెంగళూరు శుభారంభం చేసింది. అయితే, తొమ్మిదో ఓవర్ తర్వాత పిచ్ కాస్త నెమ్మదించింది. పడిక్కల్ ఆడేటప్పుడు జడేజా స్పెల్ కీలకమైంది. మరో ఎండ్ నుంచి మొయిన్ అలీని బౌలింగ్ చేయాలని ముందే చెప్పా. కానీ డ్రింక్స్ సమయంలో బ్రావోని దింపాలని ప్రణాళిక మార్చుకున్న. అలాంటి పిచ్‌పై బ్రావో వరుసగా 4 ఓవర్లు వేస్తే బాగుంటుందని అనిపించిందని ధోనీ చెప్పుకొచ్చాడు. మరోవైపు తమ బౌలర్లు పరిస్థితులను అర్థం చేసుకున్నారని, వాళ్ల బాధ్యతలేంటో తెలుసుకున్నారని ధోనీ చెప్పాడు. తమ జట్టులో చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉన్నారని, ఈ క్రమంలోనే రైనా, రాయుడులను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు పంపామన్నాడు.
ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే ?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ ఓటమి తనని మరింత నిరాశకు గురిచేసిందని తెలిపాడు. ఈ పిచ్ అనుహ్యంగా నెమ్మదించిందని, దీంతో మరో 15-20 పరుగులు రాబట్టలేకపోయమన్నాడు. తాము 175 పరుగులు చేసుంటే గెలిచే అవకాశం ఉండేదన్నాడు. మరోవైపు బంతితో ప్రభావం చూపలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. తాము బ్యాటింగ్ చేసేటప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఆఖర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిందన్నాడు. చివర్లో స్లో బంతులు, యార్కర్లు వేసి తమని కట్టడి చేశారని పేర్కొన్నాడు.