హెచ్చరిక : మరో 6-8 వారాలు జాగ్రత్త
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడినట్టు కాదు. మరో 6-8 వారాలు జాగ్రత్తగా ఉంటే మళ్లీ కరోనా ముందు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి విషయంలో వచ్చే 6 నుంచి 8 వారాల పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరిస్తే.. మనం దీన్నుంచి బయటపడొచ్చని ఆయన అన్నారు. పండగల సీజన్‌లో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
వ్యాక్సిన్ రోగాన్ని తీవ్రం కాకుండా చూస్తుందని, టీకా తీసుకున్నవారికి ఎవరికైనా ఒకవేళ కొవిడ్ సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందన్నారు. అయితే టీకాలు తీసుకున్నవారి ద్వారా.. వ్యాక్సిన్ తీసుకోనివారికి వైరస్ సోకితే అలాంటివారిలో తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. మనం మహమ్మారి అంతాన్ని చూడాలనుకుంటున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు, గుంపులుగా చేరడం మానుకోవాలన్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 31,382 మంది కొత్తగా వైరస్ బారిన పడగా.. 318 మంది కొవిడ్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కి చేరగా.. ఇంతవరకు 4,46,368 మంది మహమ్మారికి బలైపోయారు. మొత్తం 3,28,48,273 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.78%కి పెరిగింది.