ప్లేఆఫ్‌కు ధోనీసేన
ఐపీఎల్-14లో చెన్నై జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 2 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై గెలిచింది. రుతురాజ్ (40; 28 బంతుల్లో 2×4, 3×6), డుప్లెసిస్ (43; 30 బంతుల్లో 7×4) రాణించారు. చివర్లో జడేజా (22; 8 బంతుల్లో 2×4, 2×6) మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పాడు. నరైన్ (3/41) సత్తాచాటాడు. మొదట కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (45; 33 బంతుల్లో 4×4, 1×6), నితీశ్ రాణా (37 నాటౌట్; 27 బంతుల్లో 3×4, 1×6), దినేశ్ కార్తీక్ (26; 11 బంతుల్లో 3×4, 1×6) మెరిశారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ (2/20), జడేజా (1/21) రాణించారు.
101/1.. 172 పరుగుల ఛేదనలో 11 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోరిది. కానీ డుప్లెసిస్ ఔటవడంతో కథ మాంది. మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడంతో పాటు రాయుడు (10) వికెట్ తీసిన కేకేఆర్ తిరిగి పోటీలోకి వచ్చింది.తర్వాతి రెండు ఓవర్లలో కేకేఆర్ 14 పరుగులే ఇచ్చి.. అలీ, రైనా, ధోనీ (1)లను వెనక్కిపంపింది. కానీ 19వ ఓవర్లో చివరి నాలుగు బంతులకు వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన జడేజా అద్భుతమే చేశాడు. దీంతో చివరి ఓవర్లో సీఎస్కేకు నాలుగు పరుగులే అవసరమైనప్పటికీ ఉత్కంఠ తప్పలేదు. మూడో బంతికి మూడు పరుగులు తీసిన శార్దూల్ స్కోరు సమం చేశాడు. కానీ నాలుగో బంతికి పరుగులు చేయని జడ్డూ.. ఆ వెంటనే ఎల్బీగా వెనుదిరిగాడు. కానీ దీపక్ చాహర్ సింగిల్‌తో మ్యాచ్ ముగించాడు.