పవన్ ‘శ్రమదానం’ చంద్రబాబు కోసమేనా ?
శ్రమదానం – చంద్రబాబు చేపట్టిన సూపర్ హిట్ పథకాల్లో ఒకటి. అప్పట్లో శ్రమదానం పేరుతో అధికారులని ఉరుకులు, పరుగులు పెట్టించారు. పల్లెలు, పట్టణాలని శుభ్రంగా ఉంచే ప్రయత్నంచేశారు. యూత్ లోనూ స్పూర్తి నింపిన కార్యక్రమం ఇది. ఇప్పుడీ.. ఈ పథకాన్ని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టేకప్ చేశారు. ఏపీలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా జనసేన ‘శ్రమదానం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారిపై పవన్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా, భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు.
కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో పవన్‌కు జనసేన శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పోలీసులు రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పవన్ అభిమానులను ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. పవన్ సభ నిర్వహించనున్న బాలాజీపేటకు ఇరువైపుల 5 కి.మీ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా, బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ లలితకుమారి తెలిపారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామనే కసితో జనసేనాని ఉన్నారు.
పవన్ శ్రమదానం చేయడం, జనసైనికులతో కలిసి ఏపీలో పాడైపోయిన, అద్వానంగా ఉన్న రహదారులపై నిరసన తెలపడం మంచిదే. కానీ దానికి చంద్రబాబు సూపర్ హిట్ కార్యక్రమం అయిన ‘శ్రమదానం’ అని పేరు పెట్టుకోవడం ఎందుకు ? బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నా.. ఇప్పటికీ తనకు చంద్రబాబే ఆదర్శం, ఆయన పథకాలంటే ఇంకా ఇష్టం. నా చేతికి అధికారం వస్తే చంద్రబాబు పథకాలని అమలు చేస్తానని చెప్పడానికి పవన్ ప్రయత్నిస్తున్నారా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రమదానం పేరుకి బదులుగా మరో పేరు పెట్టుకోవచ్చు కదా.. ! త్రిముక్రమ్ లాంటోళ్లని అడిగితే అద్భుతమైన ఓ పథకం పేరు చెప్పేవారు కదా అని కొందరు జనాలు ప్రశ్నిస్తున్నారు.