వచ్చే యేడాది కరోనా థర్డ్ వేవ్

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మూడో ముప్పు కూడా తప్పిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారు. అయితే తాత్కాలిక బ్రేక్ మాత్రమే. వచ్చే యేడాది జనవరి, ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ ముప్పు ఉండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటాబయట అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

రాష్ట్రాల స్థాయుల్లో ఆంక్షలను సరళతరం చేస్తే.. మూడో ఉద్ధృతి ముప్పు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. భారత్‌లో జన సాంద్రత ఎక్కువ. కాబట్టి మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసుల పెరుగుదల 103% వరకూ ఉండొచ్చు. కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా.. పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుంది. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. కరచాలనం చేసుకోవడం వంటి చర్యలతో ముప్పు ఇంకా పెరుగుతుంది. పర్యాటకులు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలి. మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైద్య నిపుణులు సుచిస్తున్నారు.