కేంద్రం పైసా ఇవ్వలేదు

అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్దారు. దేశంలో ఫ‌స‌ల్ బీమా యోజ‌న శాస్త్రీయంగా లేదన్నారు కేసీఆర్. ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌తో రైతుల‌కు లాభం చేకూర‌ట్లేదన్నారు. ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌పై కేంద్రానికి సూచ‌న‌లు పంపుతామని అన్నారు. కేంద్రాన్ని తాము విమ‌ర్శించ‌డం.. వారు మ‌మ్మ‌ల్ని విమ‌ర్శించడం స‌రికాద‌న్నారు. దేశానికి బాధ్య‌త వ‌హిస్తున్న కేంద్రానికి కొన్ని బాధ్య‌త‌లు ఉంటాయని తెలిపారు. ఆహార ధాన్యాల కొర‌త రాకుండా శీత‌ల గోదాములు నిర్మించాలని చెప్పారు. శీత‌ల గోదాములు నిర్మించాల్సిన బాధ్య‌త కూడా కేంద్రంపైనే ఉంటుందన్నారు. ఆహార ధాన్యాల కొర‌తే ఏర్పడితే ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి త‌ర‌లించ‌వ‌చ్చని చెప్పారు. వ‌రి ధాన్యం తాము కొనుగోలు చేయ‌బోమ‌ని కేంద్రం చెబుతోందని సీఎం తెలిపారు.

ఇక హైద‌రాబాద్‌లో వచ్చిన వ‌ర‌ద‌లతో చాలా న‌ష్టం జ‌రిగింది. దాదాపు రూ. 8 వేల కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని కేంద్రానికి నివేదిక పంపాం. కానీ కేంద్రం నుంచి స్పంద‌న లేదని మండిపడ్డారు. డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ జ‌రిగితే కొంత డ‌బ్బు ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న ఉన్నా.. కేంద్రం దీనిపై స్పందించ‌డం లేదన్నారు. ప‌రిహారం కింద కేంద్రం పైసా కూడా ఇవ్వ‌లేదని తెలిపారు. న‌ష్టం అంచ‌నాల‌పై రెండు ర‌కాల నివేదిక‌లు పంపుతారని, తాత్కాలిక అంచనాను కేంద్రానికి పంపిస్తామన్నారు. త‌క్ష‌ణ స‌హాయం కోసం తాత్కాలిక నివేదిక పంపుతారన్న సీఎం.. హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌లు వ‌స్తే ఇంత వ‌ర‌కు కేంద్ర బృందం ప‌ర్య‌టించ‌లేదు విమర్శించారు.