భారత్-చైనా.. మళ్లీ ఘర్షణ !

సరిహద్దుల్లో నిత్యం బలగాలను మోహరిస్తూ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించాయి. దాదాపు 200 మంది పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) జవాన్లు వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంగా రావడాన్ని గుర్తించారు. వీరు ఎల్‌ఏసీని దాటేందుకు ప్రయత్నించడంతో భారత సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ చోటుచేసుకుంది. అయితే ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఇరు దేశాల బలగాలు వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లినట్లు సమాచారం.

ఈ ఏడాది ఆగస్టు 30న దాదాపు 100 మంది చైనా జవాన్లు ఉత్తరాఖండ్‌లోని బారాహొతి ప్రాంతంలో వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగం వైపు 5 కిలోమీటర్ల లోపలికి వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు మన భూభాగంలోనే ఉన్నారు. అక్కడి వంతెనను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసులు అక్కడకు చేరుకునే లోపు వారు వెనుదిరిగారు. తూర్పు లద్దాఖ్‌ వివాదంలో పరిష్కారం కోసం భారత్‌, చైనా మధ్య మరికొద్ది రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనున్న సమయంలో అరుణాచల్‌లో ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం.