రివ్యూ : కొండపొలం
చిత్రం : కొండపొలం (2021)
నటీనటులు : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు తదితరులు
సంగీతం : ఎంఎం కీరవాణి
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
కొండపొలం – క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రమిది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. పాటలు, టీజర్, ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరోసారి క్రిష్ మేజిక్ చేయనున్నారని అనిపించింది. ఇలా భారీ అంచనాల మధ్య కొండపొలం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. కొండపొలం కథేంటీ.. ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
రవీంద్రనాథ్ (వైష్ణవ్‌తేజ్) గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన ఓ యువకుడు. ఉద్యోగవేటలో హైదరాబాద్ చేరుకుంటాడు. నాలుగేళ్లు ప్రయత్నించినా ఉద్యోగం రాదు. ఆత్మవిశ్వాస లోపమే తనకి శాపంగా మారుతుంది. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తిరిగి ఊరికి చేరుకుంటాడు. కరవు కాటకాల వల్ల తండ్రితో పాటు గొర్రెల్ని మేపడం కోసం కొండపొలానికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడికి అడవి ఏం నేర్పింది? గొర్రెల్ని కొండపొలానికి తీసుకెళ్లి వచ్చాక అతనిలో వచ్చిన మార్పేమిటి?యూపీఎస్సీలో ఐ.ఎఫ్.ఎస్‌కి ఎంపికయ్యేంత ఆత్మవిశ్వాసాన్ని ఎలా సంపాదించాడనేది మిగతా కథ.
నటీనటుల పర్ ఫామెన్స్ :
వెన్నెముక లేనట్టుగా భయం భయంగా కనిపించే ఓ యువకుడు… ఆత్మవిశ్వాసంతో తలపైకెత్తి నిలిచేంత ధైర్యాన్ని, తనపై తనకి నమ్మకాన్ని అడవి, అడవిలాంటి ఓ యువతి ఎలా ఇచ్చారనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం. నల్లమల అడవి నేపథ్యంలో సాగుతుంది. అడవి, గొర్రెల కాపరుల జీవిత చిత్రాన్ని తెరపై సహజంగా ఆవిష్కరించారు క్రిష్. కథానాయకుడికి ఎదురయ్యే ఒక్కొక్క సవాల్… ఒక్కో వ్యక్తిత్వ వికాస పాఠంలా ఉంటుంది.
వైష్ణవ్‌తేజ్ తన నటనతో ఆకట్టుకున్నారు. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువకుడిగా పాత్రలో ఒదిగిపోయాడు. రాయలసీమ యాస పలికిన విధానం కూడా మెప్పిస్తుంది. పులితో చేసే పోరాట ఘట్టాల్లోనూ మెప్పిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ చేసే రొమాన్స్ బాగుంది. సాయిచంద్, రవిప్రకాశ్, కోట శ్రీనివాసరావు, మహేశ్ పాత్రలు కూడా హత్తుకునేలా ఉంటాయి. అడవితో మమేకమైనకొద్దీ ధైర్యశాలిగా మారే క్రమం, పులితో చేసే పోరాటం సినిమాకి హైలైట్. భావోద్వేగాలు ఈ సినిమాలో పండక పోవడంతో అక్కడక్కడా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉత్కంఠ రేకెత్తించాల్సిన పోరాట ఘట్టాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి.
సాంకేతికంగా :
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మాటలు, పాటలు సినిమాకి బలాన్నిచ్చాయి. కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి. కెమెరా పనితనం మెప్పిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ నేపథ్యం వైష్ణవ్ తేజ్ నటన
సంగీతం
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
ఎమోషన్స్ పండకపోవడం
స్లో నేరేషన్
బాటమ్ లైన్ : కొండపొలం – ఆత్మవిశ్వాసాన్ని పెంచే సినిమా
రేటింగ్ : 3/5