మా ఎన్నికలు : మంచి విష్ణు ప్యానల్ ‘మేనిఫెస్టో’.. ఇదే !
మా ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 10న మా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచి విష్ణు ప్యానల్స్ ఓటర్లని ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మంచు విష్ణు ప్యానల్ మేనిఫెస్టోని విడుదల చేసింది. మా సభ్యులకు భరోసా కల్పించేలా మేనిఫెస్టోని రూపొందించారు. భారతదేశంలో ఒక శక్తిమంతమైన నటుల సమూహంగా ‘మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)’ ఉండాలి. అది నా కల. మేం అమలు చేయనున్న పథకాలు సభ్యులందరికీ భరోసాని కల్పిస్తాయి” అన్నారు మంచు విష్ణు.
తమ ప్యానెల్ విజయం సాధిస్తే రెండు ప్రభుత్వాలతో మాట్లాడి అర్హులైన నటులకి సొంత ఇల్లు వచ్చేందుకు కృషి చేస్తామని, అలాగే సొంత ఖర్చులతో ‘మా’ నూతన భనవం నిర్మిస్తామని విష్ణు ప్రకటించారు. ”అసోసియేషన్‌లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నవారికి ‘మా యాప్’ ద్వారా సభ్యుల పోర్ట్ ఫోలియోల్ని క్రియేట్ చేసి నిర్మాతలు, దర్శకులు, రచయితలకి అందిస్తాం. తెలుగు ఆత్మ గౌరవం ఉట్టి పడేలా సొంత డబ్బుతో ‘మా’ భవనం నిర్మిస్తాం. ప్రతి సభ్యుడికీ వారి కుటుంబ సభ్యులకి ఉచిత ఆరోగ్య బీమా, మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణ కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు తమ ప్రాధాన్యం” అన్నారు విష్ణు.
స్వచ్ఛంద సంస్థతో సర్వే చేయించి, అర్హులైన వృద్ధ పేద కళాకారులకి ఇప్పుడు ఇస్తున్న పింఛన్‌ని పెంచి అందించే ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ‘మా’ సభ్యత్వ రుసుము తగ్గింపు, నిధుల సేకరణ కోసం కల్చరల్ అండ్ ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు, సభ్యుల పిల్లలకి సినిమాలపట్ల అభిరుచి ఉంటే వారికి మోహన్‌బాబు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.