ఈ నెల 25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక
రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నుకొనే పద్దతిని టీఆర్ఎస్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం ఈనెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందన్నారు. 23న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపడతామని చెప్పారు.
25న తెరాస అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. ఇక నవంబర్ 15న వరంగల్లో ‘తెలంగాణ విజయ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించిన సన్నాహక సభలు నిర్వహిస్తామన్నారు.
టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ నే కొనసాగుతున్నారు. ఆయన నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్ కొట్లాడింది. సాధించింది. ప్రత్యేక తెలంగాణలో తొలి, మలి ప్రభుత్వాలని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కు కేసీఆర్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఈ నెల 25న మరోసారి ఆయన్ని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకొనుంది. మరోవైపు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయబోతున్నట్టు ఆ మధ్య ప్రచారం జరిగినా… ఆ తర్వాత అందులో నిజం లేదని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ మంచి ముహూర్తం చూసుకొని.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.