ముందస్తు ఆలోచన లేదు
షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ఈసారి ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతో కలిపి జరిగితే నష్టమనే భావనతో గతంలో ముందస్తుకు వెళ్లామని, ఈసారి అలాంటి అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్ష సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు పోవడంపై స్పష్టత నిచ్చారు. శాసనసభకు 2023 చివర్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి ఘన విజయం సాధిస్తుందని, 98కి పైగా స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడుతుందన్నారు.
70 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెరాస ప్రభుత్వం ఏడేళ్లలోనే సాధించి చూపిందని చెప్పారు. వచ్చే 26 నెలలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. పార్టీని, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిచి కేంద్రంలోనూ క్రియాశీలకపాత్ర పోషిస్తామన్నారు. ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా నవంబరు 15న 10 లక్షల మందితో వరంగల్‌లో విజయగర్జన సభను నిర్వహిస్తామని.. తమపై మొరిగేవారి నోళ్లు మూయిస్తామని స్పష్టం చేశారు. ఆ సభకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు.