దళిత బంద్.. టీఆర్ఎస్’కు ఓట్లు బంద్ !
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని భావిస్తున్న గులాబి పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. హుజురాబాద్ లో దళిత బంద్ అమలును ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా దళిత బంద్ అమలు చేయడం వీలు కాదని తేల్చి చెప్పింది. దీంతో.. ఉప ఎన్నికకు ముందే.. హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకు దళిత బందు అందదు. అలాంటప్పుడు ఈ ఉప ఎన్నికలో దళితులు టీఆర్ఎస్ ని ఆదరిస్తారా ? ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఓట్లు వేస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ? రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని ఆ తర్వాత అమలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడీ.. ఈ పాయింట్ నే బీజేపీ హైలైట్ చేస్తున్నది. దళిత బంద్ చేసినట్టే.. ప్రజలు టీఆర్ఎస్ కు ఓట్లు వేయడం బంద్ చేస్తారని చెప్పుకుంటున్నారు.
మరోవైపు దళితబంధు అమలుని ఎవరు ఆపలేరు. మహా అంటే పదిరోజులు మాత్రమే దళిత బందును ఆపగలుగుతారమో. కానీ హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసిన వెంటనే హుజురాబాద్ లో దళితబంధు అమలు అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వాస్తవానికి హుజురాబాద్ లో మొదట ఈటల వైపే మొగ్గు కనిపించింది. కానీ సీఎం కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలతో ఈక్వెషన్స్ మార్చారు. నియోజకవర్గంలోని కీలక నేతలని పార్టీలో చేర్చుకున్నారు. దళితబంధు ప్రకటనతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ-టీఆర్ఎస్ 50-50 ఛాన్సెస్ వరకు వచ్చింది. ఇలాంటి టైమ్ లో దళితబంధు అమలు ఆపాలని ఈసీ నుంచి ఆదేశాలు రావడం తెరాస గెలుపు అవకాశాలని దెబ్బతీసేవేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.