యాదాద్రి : మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఫిక్స్
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని చినజీయర్ స్వామి ముహూర్తం నిర్ణయించారని సీఎం కేసీఆర్ తెలిపారు. మంగళవారం సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో క్షేత్రానికి చేరుకున్న ఆయన పనుల పరిశీలన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
యాదాద్రి ఆలయాన్ని పునః ప్రారంభించాలంటే మహాకుంభ సంప్రోక్షణ చేయాలి. విద్వత్‌సభ, సిద్ధాంతుల సభను సమావేశపరిచిన అనంతరం చినజీయర్ స్వామి వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని ముహూర్తం నిర్ణయించారు. అంతకు వారం రోజుల ముందు మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు పునః ప్రారంభమవుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు.