200 ఎకరాల్లో యాగం
మహోత్కృష్టమైన ఆలయాల్లో ఒకటైన యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేలా పునర్నిర్మాణం చేపట్టింది కేసీఆర్ సర్కారు. పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని ముహూర్తం నిర్ణయించారు. మంగళవారం యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు.
క్రతువుకు 1.50 లక్షల కిలోల నెయ్యి వినియోగిస్తామన్నారు. దేశంలోని వివిధ ప్రసిద్ధ క్షేత్రాలు, వైష్ణవ పీఠాధిపతులు, అమెరికా తదితర దేశాల నుంచి అర్చకులు, అయిదారు వేల మంది రుత్విక్కులు, వారి సహాయకులు రానున్న దృష్ట్యా కొండ కింద ఉన్న 200 ఎకరాల్లో యాగం నిర్వహిస్తామన్నారు. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తిరుమల తరహాలో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించాం. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరం. ఈ పవిత్ర కార్యానికి తొలి విరాళంగా మా కుటుంబం తరఫున ఒక కిలో 16 తులాల బంగారం ఇస్తామని సీఎం తెలిపారు.
చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. చినజీయర్ స్వామి పీఠం నుంచి కిలో బంగారం, మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరఫున కిలో, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరఫున కిలో, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి తన రెండు వస్త్ర సంస్థల తరఫున రెండు కిలోలు, కావేరి సీడ్స్ అధినేత భాస్కర్‌రావు కిలో, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు కిలో బంగారం.. ఇలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నారు. ప్రతి గ్రామం భాగస్వామి కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి రూ. 11 ఇవ్వాలని కోరారు.