కాస్ట్లీ గిప్ట్స్ అమ్ముకుంటున్న ప్రధాని

దేశ ప్రధానికి విలువైన బహుమతులు రావడం సహజమే. పలు సందర్భాల్లో ఇతర దేశాధినేతలు కాస్ట్లీ గిఫ్ట్స్ అందజేస్తుంటారు. వాటిని కూడా క్యాష్ చేసుకొని వివాదంలో చిక్కుకున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై పలువురు ప్రతిపక్ష నేతలు బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇతర దేశాధినేతలు అందజేసిన బహుమతులను ఆయన అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.

ఓ గల్ఫ్‌ దేశ యువరాజు ఇచ్చిన ఖరీదైన గడియారాన్ని విక్రయించి సుమారు రూ.7.4 కోట్లు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. ఆయన తీరు సిగ్గుచేటని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) పార్టీ ఉపాధ్యక్షురాలు మర్యమ్‌ నవాజ్, విపక్ష కూటమి- పాకిస్థాన్‌ డెమోక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌ తదితరులు ఇమ్రాన్‌పై ఈ ఆరోపణలు గుప్పించినవారిలో ఉన్నారు.