డాన్ రంగంలోకి దిగినా ‘డీల్’ సెట్ కావడం లేదా ?

టాలీవుడ్ కు తెలంగాణలో ఎలాంటి సమస్యల్లేవ్. ఏపీ ప్రభుత్వంతోనే చిక్కులు. ఈ సమస్యల పరిష్కారం కోసం టాలీవుడ్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. టిక్కెట్ల ధరలు, ధియేటర్లకు అనుమతులు, బెనిఫిట్ షోలు, ఆన్ లైన్ టిక్కెట్ల వివాదం ఇలా అనేక అంశాల పరిష్కారం కాకుండా పడి ఉన్నాయి.

ఈ క్రమంలో జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామిగా ప్రచారంలో ఉన్న నాగార్జున ప్రత్యేక విమానంలో వచ్చి జగన్‌తో చర్చించి వెళ్లారు. తర్వాతి రోజే దిల్ రాజు టీమ్ వచ్చి పేర్ని నానిని కలిసింది. పేర్ని నాని అడిగిన సమాచారం ఇచ్చామని నిర్మాతలు చెబితే.. కాఫీ తాగి వెళ్లడానికి వచ్చారని మంత్రి చెప్పారు. దీంతో చర్చలు జరుగుతున్నాయి కానీ డీల్ మాత్రం సెట్ కావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గురువారమే టిక్కెట్‌లను ఆన్‌లైన్‌లో అమ్మాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం ఆర్డినెన్స్ తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే ఏపీలో సినిమా టిక్కెట్లన్నీ ప్రభుత్వ పోర్టల్ ద్వారానే అమ్మాల్సి ఉంటుంది. అయితే ఈ విధానానికి సినీ పెద్దలు అంగీకారం తెలిపారని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ అంగీకారం సరిపోవడం లేదు. ఎగ్జిబిటర్లు వ్యతిరేకిస్తున్నారు. నిర్మాతలు కూడా ఇప్పటికే టిక్కెట్లు అమ్ముతున్న పోర్టల్స్‌తో ఒప్పందాల గురించి చెబుతున్నారు. కలెక్షన్లు ఏ రోజుకారోజు ఇస్తారో లేదో చెప్పాలంటున్నారు. వీటన్నింటిపై టాలీవుడ్ – ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నప్పటికీ పరిష్కారం కోసం ఓ డీల్ మాత్రం కుదరడం లేదు.